Breaking News

సఫారీ గడ్డపై కోహ్లీ సేన కొత్త చరిత్ర

ఐదో వన్డేలో దక్షిణాఫ్రికాపై 73 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా

టీమిండియా కల నెరవేరింది. 1992 నుంచి ఎన్నోసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించినా దక్కని సిరీస్ విజయం ఇన్నాళ్లకు సాకారమైంది. సఫారీలతో జరిగిన ఐదో వన్డేలో నెగ్గిన కోహ్లీ సేన సిరీస్ ను 4-1తో కేవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఏ ఫార్మాట్ లో అయినా సఫారీగడ్డపై భారత్ కు ఇదే తొలి సిరీస్ విజయం. మంగళవారం పోర్ట్ ఎలిజబెత్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 73 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది.

తొలి నాలుగు మ్యాచ్ లలో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ (115) అద్భుత సెంచరీతో తానేంటో నిరూపించుకోగా, ధావన్ ((34), కెప్టెన్ విరాట్ కోహ్లీ (36), శ్రేయాస్ అయ్యర్ ((30) ఫరవాలేదనిపించారు. అయితే చివర్లో సఫారీ ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడి కారణంగా వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.

ఇక లక్ష్యఛేదనలో సఫారీలను భారత బౌలర్లు ఎప్పట్లాగానే ఉక్కిరిబిక్కిరి చేశారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, పాండ్య, చహల్ రెండేసి వికెట్లతో రాణించగా… దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ హషీమ్ ఆమ్లా 71 పరుగులు చేశాడు.

Gallery