Breaking News

అండర్-19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్ల జయభేరి

న్యూజిలాండ్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం చేసింది. మౌంట్ మాంగనూయ్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో పృథ్వీ షా నాయకత్వంలోని భారత కుర్రాళ్లు 100 పరుగుల తేడాతో బలమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఓపెనర్లు పృథ్వీ షా (100 బంతుల్లో 94), మన్ జోత్ కల్రా (99 బంతుల్లో 86) పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. శుభ్ మాన్ గిల్ 54 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో తనవంతు సహకారం అందించాడు. ఆసీస్ బౌలర్లలో ఎడ్వర్డ్స్ కు 4 వికెట్లు దక్కాయి.

ఇక లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా జట్టు 42.5 ఓవర్లలో 228 పరుగులకే ఆలౌటైంది. 70 పరుగులు చేసిన ఎడ్వర్డ్స్ మినహా మరెవ్వరూ రాణించలేదు. భారత బౌలర్లలో కమలేష్ నాగర్ కోటి 3, శివమ్ మావి 3 వికెట్లతో రాణించారు. విలువైన ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ పృథ్వీ షా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు. భారత కుర్రాళ్లు తమ తర్వాత మ్యాచ్ పాపువా న్యూగినియా జట్టుతో జనవరి 16న ఇదే వేదికపై ఆడనున్నారు.

Gallery